

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. జవహర్‌నగర్, పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం నగరంలో పేరుకుపోతున్న చెత్త నుంచి వెలువడే దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరానికి ప్రధాన వ్యర్థాల నిల్వ కేంద్రంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కొనసాగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, మల్కాజిగిరి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి ఇటీవల డంపింగ్ యార్డు పరిసర బస్తీలను సందర్శించినప్పటికీ, సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్ వాయువు వ్యాప్తిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి, కాలుష్య తీవ్రతను నిర్ధారించే ప్రయత్నం కూడా జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా దుర్వాసన రాకుండా ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, దుండిగల్ గ్రామాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఖానాపూర్, యాచారం ప్రాంతాల్లో భూముల సర్వే చేపట్టినట్లు సమాచారం. అయితే, స్థానికుల ఆందోళనలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనంతరం జవహర్‌నగర్‌లో రెండు, దుండిగల్‌లో ఒక వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు సుమారు 2,500 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నప్పటికీ, జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తగ్గడం లేదు. గతంలో రోజుకు 7,500 టన్నులుగా ఉన్న నగర చెత్త ఉత్పత్తి ప్రస్తుతం 10,500 టన్నులకు చేరినట్లు నివేదిక పేర్కొంది. రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్‌లో అత్యాధునిక వ్యర్థాల రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు.
అందించిన నివేదికలోని గణాంకాల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువడే ప్రాంతాల్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నాలుగో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి గంటకు సుమారు 5.9 టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతున్నట్లు అంచనా. ఇది 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యంతో సమానమని నివేదికలో ప్రస్తావించారు. కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే మీథేన్ స్వల్పకాలంలో భూతాపాన్ని పెంచడంలో మరింత శక్తిమంతమైన హరితగృహ వాయువు. ఈ గణాంకాలు వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పర్యవేక్షణ, మెరుగైన ప్రాసెసింగ్ విధానాలు, ప్రత్యామ్నాయ కేంద్రాల ఏర్పాటు ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!