

భారత్లో ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై ఆందోళనలు చేపడుతున్న యువత ప్రభుత్వ వివక్ష, అణచివేతను ఎదుర్కొంటోందంటూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. హక్కుల కోసం పోరాడేందుకు యువతకు తగిన స్వేచ్ఛ లేదని ఆమె పలు నివేదికలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస వేదికగా స్పందించిన భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్.. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా ధ్రువీకరించని నివేదికల ఆధారంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోందని పేర్కొన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత పత్రికారంగం, జాతీయ మానవ హక్కుల కమిషన్ పౌరుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. నిర్ధారణ లేని కథనాల ఆధారంగా ఆరోపణలు చేయడం ఐక్యరాజ్యసమితి, దాని సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.
భారత్లో ప్రభుత్వ అణచివేత కొనసాగుతోందన్న వాదనలను అనుజ్ స్వరూప్ ప్రశ్నించారు. యువత ప్రభుత్వాన్ని, నాయకులను బహిరంగంగా ప్రశ్నించగలుగుతోందని, దేశ రాజధానిలో నిరసనలు చేపడుతోందని పేర్కొన్నారు. యువత ఉద్యమాల సమయంలో ప్రభుత్వం, నిరసనకారుల మధ్య చర్చలు ప్రభావవంతంగా జరుగుతున్నాయని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై స్పందిస్తూ.. యువతతో సంప్రదింపులు జరిపి, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. యువత హక్కులు, నిరసనల స్వేచ్ఛపై ఐరాస ప్రతినిధి చేసిన ఆరోపణలు, వాటిని భారత్ ఖండించడం ఈ సమావేశంలో చర్చనీయాంశంగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!