

ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ బదులిచ్చింది. ఐరాసలో భారత శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి భావికా మంగళానందన్ పాక్ వ్యాఖ్యలను ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని, ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్‌కు లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై దృష్టి పెట్టే బదులు, తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో మైనారిటీల హక్కుల పరిరక్షణపై పాకిస్థాన్ దృష్టి సారించాలని సూచించారు. అక్కడ మైనారిటీల హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆమె ఆరోపించారు.
‘అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియల హక్కులు, మత విశ్వాసాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో మంగళానందన్ పాకిస్థాన్‌పై విమర్శలు చేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను కూడా పాకిస్థాన్ స్వీకరించలేదని పేర్కొంటూ, అలాంటి దేశం మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో భారత సైన్యం పాక్ సైనికులకు సైనిక లాంఛనాలతో, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఉగ్రవాదుల హక్కుల గురించి మాట్లాడే పాకిస్థాన్, ఉగ్రవాద బాధితుల హక్కుల గురించి కూడా ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!