

భారత్‌లో అన్ని రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలో నిర్వహించిన ‘దసరా మిలన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడికి హాజరైన భారతీయులు, ఆస్ట్రేలియా పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ రంగాల్లో ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులు తమ మాతృదేశ అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ, భారత్‌లో విద్య, వైద్య రంగాలు అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. దేశ విజయాలు, సాంకేతిక పురోగతి, ఆవిష్కరణల గురించి తమ స్నేహితులకు వివరించాలని కోరారు.
భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశంపై వచ్చే ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ప్రవాస భారతీయులకు సూచించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, యోగా, వారసత్వ సంపద, సంప్రదాయాల గొప్పతనాన్ని విదేశీయులకు పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగు ప్రజలు తమ ఆస్ట్రేలియన్ స్నేహితులను భారత్‌కు తీసుకువచ్చి, దేశంలోని ప్రాచీన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేలా ప్రోత్సహించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!