

పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పర్యటన అక్టోబర్ 17న ముగిసింది. అక్టోబర్ 14 నుంచి 17 వరకు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్ తదితర నిపుణులు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్లోని గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా నియంత్రణ పరీక్షల విధానాన్ని సమీక్షించారు. నాలుగు రోజుల పర్యటనలో మొత్తం 40 గంటలు ప్రాజెక్టు పనులపై దృష్టి సారించగా, 13 గంటలు క్షేత్రస్థాయి పరిశీలనకు, 27 గంటలు సమీక్షా సమావేశాలకు కేటాయించారు. నిర్మాణ పనులు, పరీక్షల నిర్వహణ తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
పర్యటన చివరి రోజున పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ, ఎంఈఐఎల్ అధికారులతో సమావేశమైన నిపుణులు నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. అయితే, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న నాణ్యతా పరీక్షల విధానాన్ని కొనసాగించడంతో పాటు ప్రతి పరీక్ష ఫలితాన్ని, నిర్మాణానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి పోలవరాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా ఆధ్వర్యంలో పర్యటన సమన్వయంతో సాగగా, చివర్లో అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర అధికారులను ఆయన సత్కరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!