

హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సముద్ర తీరానికి ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కొట్టుకొచ్చాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రం నుంచి ఒడ్డుకు చేరిన వస్తువులను తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నట్లు కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది. కొందరు జాలర్లు చిన్న పడవల్లో వెళ్లి, ఐఫోన్లు ఉన్నాయని భావిస్తున్న షిప్పింగ్ కంటైనర్‌ను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ వస్తువుల్లో కొన్ని శనివారం ఇరాన్ తీరానికి చేరినట్లు సమాచారం. అయితే అవి ఏ ప్రాంతంలో కొట్టుకొచ్చాయనే విషయంపై స్పష్టత లేదు.
ఈ వస్తువులు హర్మూజ్ జలసంధిలో మునిగిపోయిన జీఎఫ్‌ఎస్ ప్రైడ్ అనే సింగపూర్ జెండా కలిగిన కార్గో నౌకకు సంబంధించినవిగా నివేదికలు పేర్కొంటున్నాయి. సముద్రపు మైన్‌ను ఢీకొనడంతో నౌక మునిగిపోయినట్లు సమాచారం. దుబాయ్ నుంచి సుమారు 2,500 కంటైనర్లతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు సహా వివిధ వస్తువులు ఉన్నట్లు కథనం చెబుతోంది. ప్రమాదం తర్వాత కొన్ని కంటైనర్లు సముద్రంలో చెల్లాచెదురై, వాటిలోని వస్తువులు నీటిపై తేలియాడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఏఐ సాంకేతికతతో రూపొందించినవై ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా ఫ్యాక్ట్ చెక్ కథనాలు హెచ్చరించాయి. అందువల్ల వైరల్ వీడియోలన్నింటినీ నిజమైన దృశ్యాలుగా భావించకుండా, వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవడం అవసరం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!