

న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రభుత్వానికి అవసరానికి మించి విధేయత చూపేవారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విమర్శించారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అంశాల్లో ఆయన అవసరానికి మించి వ్యవహరించేవారని పేర్కొన్నారు. ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’ పేరుతో త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథకు సంబంధించి ‘ద వైర్’ వార్తా పోర్టల్ తరఫున సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ఆరుగురు న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి కొలీజియం సమావేశమైన సందర్భంలో, ఐదుగురి పేర్లపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత చివరి నిమిషంలో ఆరో పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారని కౌల్ వెల్లడించారు. ఆ పేరుపై తనకు, ఇతర సభ్యులకు అంగీకారం లేదని చెప్పినప్పటికీ, ప్రభుత్వ వైఖరిని తెలుసుకునేందుకు ఫోన్ చేయాలని చంద్రచూడ్ సూచించారని తెలిపారు. ఆ పేర్లపై ముందుగానే ప్రభుత్వ ఆమోదం తీసుకున్నట్లు తనకు అనిపించిందని, అయితే సంప్రదింపులకు, ముందస్తు అనుమతికి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటే కొలీజియం కార్యనిర్వాహక వ్యవస్థ ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
చంద్రచూడ్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారని తాను చెప్పడం లేదని, అయితే న్యాయమూర్తుల పేర్లపై ముందుగానే ప్రభుత్వంతో చర్చించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని కౌల్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు రాకేశ్ ద్వివేది మాత్రం న్యాయమూర్తుల నియామకాల విషయంలో చంద్రచూడ్ ప్రభుత్వానికి విధేయంగా వ్యవహరించేవారనే ఆరోపణ సరికాదని పేర్కొన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్.. ప్రభుత్వంతో చంద్రచూడ్ వ్యవహరించిన తీరు, కీలక కేసుల కేటాయింపులపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, న్యాయవ్యవస్థలో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న విషయం కౌల్ వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆరోపించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!