

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఉత్సవాల్లో మొదటి 10 రోజుల్లో మొత్తం 30,69,048 లడ్డూలు విక్రయించారు. గత ఏడాది ఇదే సమయంలో 23,19,201 లడ్డూలు అమ్ముడవగా, ఈసారి 7,49,847 లడ్డూల విక్రయాలు పెరిగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల్లో 11వ రోజైన అక్టోబర్ 21న సాయంత్రం 6 గంటల వరకు మరో 5,08,676 లడ్డూలు విక్రయించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 35,77,724కు చేరింది. భక్తులకు ప్రసాదం కొరత లేకుండా ఆలయ పోటులో నిరంతరాయంగా లడ్డూల తయారీ చేపట్టినట్లు దేవస్థానం ఈవో శ్రీనాయక్ తెలిపారు. ప్రస్తుతం మరో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉన్నాయని, తయారీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!