

గుజరాత్‌లోని వడోదర నగరం తండల్జా ప్రాంతంలో తన ఇంటికి ఆనుకుని ఉన్న 978 చదరపు మీటర్ల వివాదాస్పద స్థలానికి సంబంధించి మాజీ క్రికెటర్, లోక్‌సభ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు కీలక పరిణామం ఎదురైంది. ఆ స్థలాన్ని ఆయనకు కేటాయించే ప్రతిపాదనకు గుజరాత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం స్థలంలో 500 చదరపు మీటర్లను ఉచితంగా కేటాయించేందుకు, మిగిలిన 478 చదరపు మీటర్లను రాయితీ ధరకు విక్రయించేందుకు అంగీకరించినట్లు సమాచారం. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదం లభించిందని, తదుపరి ప్రతిపాదనను సంబంధిత కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. కమిటీ ఆమోదం అనంతరం కేటాయింపు ప్రక్రియ చేపడతామని, పఠాన్ చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని వెల్లడించారు.
ఈ భూవివాదం 2012లో ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రీడాకారుల కోటా కింద తన ఇంటికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పఠాన్ అప్పట్లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. బహిరంగ వేలం లేకుండా 99 ఏళ్ల లీజుపై స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనను 2014లో గుజరాత్ పట్టణాభివృద్ధి శాఖ తిరస్కరించింది. అయినప్పటికీ, పఠాన్ ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నారని అధికారులు పేర్కొన్నారు. 2024లో ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. లీజు ఉత్తర్వులు లేకుండా స్థలాన్ని వినియోగించడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం 2026లో స్థల కేటాయింపు విధానానికి సంబంధించిన అప్పీళ్లను పఠాన్ వెనక్కి తీసుకున్నారు. తాజా ప్రభుత్వ ఆమోదం నేపథ్యంలో తుది కేటాయింపునకు కమిటీ అనుమతి, చెల్లించాల్సిన మొత్తం ఖరారు కావాల్సి ఉంది














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!