

పండగల సమయంలో స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనివల్ల స్వయం సమృద్ధ భారత్ లక్ష్యం నెరవేరడంతోపాటు స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన స్థానిక ఉత్పత్తుల ప్రాముఖ్యతను వివరించారు. స్థానికంగా తయారైన వస్తువులకు ప్రోత్సాహం లభిస్తుండటంతో భారత ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకూ చేరుతున్నాయని పేర్కొన్నారు. బిహార్ నుంచి మఖానా గ్రీస్‌కు, కర్ణాటక నుంచి కందిపప్పు మాల్దీవులకు ఎగుమతి అవుతున్నాయని ఉదహరించారు. దీనివల్ల రైతులకు ప్రపంచ మార్కెట్లో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. పండగల సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు బహుమతులుగా ఇచ్చేందుకు స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజల కొనుగోళ్లు కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు వారి జీవనోపాధికి తోడ్పడతాయని వివరించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న స్ఫూర్తిదాయక కార్యక్రమాలను కూడా మోదీ ప్రస్తావించారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో పత్తి రైతులు సంప్రదాయ సేంద్రియ సాగు పద్ధతులను పాటించేలా ‘ఖేతీ విరాసత్ మిషన్’ సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో హెవల్ నది పరిరక్షణ కోసం వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు, మొక్కల పెంపకం చేపట్టడాన్ని అభినందించారు. వైద్యులతో దూరం నుంచి సంప్రదింపులు జరిపేందుకు ఉపయోగపడుతున్న ఈ-సంజీవని పథకం ద్వారా ఇప్పటివరకు 50 కోట్ల సంప్రదింపులు పూర్తికావడం సంతోషకరమని తెలిపారు. ‘మన్ కీ బాత్’ ద్వారా 12 ఏళ్లుగా ప్రజలతో అనుసంధానమవుతున్నానని, ఈ కార్యక్రమం తనకు ఆధ్యాత్మిక యాత్రలా అనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. సామాన్యుల సేవా స్ఫూర్తి, కృషి, త్యాగాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలుస్తోందని, శ్రోతల అభిమానం తనకు అమూల్యమైన ఆస్తి అని చెప్పారు.








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!