

విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా పున్నమి ఘాట్లో శనివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానం మేరకు వచ్చిన ఆయనకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి చైనా రాయబారి జు ఫీహోంగ్, ఆయన సతీమణి టాన్ యుక్సియు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ యాదవ్ మాట్లాడుతూ, కోహినూర్ వజ్రం తిరిగి భారత్కు రావాలని ఆకాంక్షించారు. కృష్ణా తీర ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఏపీ ప్రజలను ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత తన పాటలతో ప్రేక్షకులను అలరించగా, వివిధ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!