

హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రీవనం సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ పేరుతో నడుస్తున్న బట్టల దుకాణం ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని మంటలు పూర్తిగా ఆవరించాయి. భవనం అంతటా మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల తీవ్రత కారణంగా భవనం సమీపానికి వెళ్లడం కూడా కష్టంగా మారింది.
ఈ భవనం చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ దుకాణాలు, మొబైల్ షాపులు ఉండటంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. తమ దుకాణాల్లోని విలువైన వస్తువులను బయటకు తరలిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. షాపులో పెద్ద మొత్తంలో దుస్తుల నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. సమీప భవనాలకు మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!