

కర్ణాటక అసెంబ్లీ భవనం పేలిపోయినట్లు ఏఐ సాయంతో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ యువకుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని అరేరియా జిల్లాకు చెందిన హజ్రత్ అలీ షోయబ్ కొంతకాలం క్రితం బెంగళూరుకు వచ్చి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. తాజాగా అతడు కర్ణాటక అసెంబ్లీ భవనం పేలిపోతున్నట్లు చూపించే ఏఐ వీడియోను రూపొందించి, “jnx_king_h_g” అనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది.
దీంతో పోలీసులు ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను పరిశీలించి, అందులో నమోదైన మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ భవనం పేలిపోయినట్లు వీడియో రూపొందించడానికి గల కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ వీడియోను అతడే రూపొందించాడా, మరెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు వీడియో వెనుక ఉద్దేశం, ఇతరుల ప్రమేయంపై స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!