

ముంబయిలో అనుమానిత జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాదిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. క్యాబ్ బుకింగ్ సేవల సంస్థలో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ ఆన్‌లైన్‌లో తీవ్రవాద కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారంతో దర్యాప్తు చేపట్టిన ATS బృందం ముంబయిలోని మహిమ్ మెట్రో స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన హ్యాండ్లర్లతో పాటు పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారని వెల్లడించారు.
అధికారుల సమాచారం ప్రకారం, నిందితుడు టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూపులను నిర్వహిస్తూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా లోపానికి సంబంధించిన నివేదికను కూడా పలు యాప్‌లలో పోస్టు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారని తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతడితో సంబంధాలు ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున, సంబంధిత వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!