

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గల్ఫ్ దేశాలకు పరిచయం చేస్తూ ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసెనో’ అనే ప్రత్యేక బతుకమ్మ పాటను దుబాయ్లో ఘనంగా ఆవిష్కరించారు. అక్షర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ గ్రూప్ ఛైర్మన్ కోట కుమార్ (కేకే) ఈ పాటను నిర్మించగా, తెలంగాణ జానపద కవి, గాయకుడు మట్టెపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. ప్రముఖ గాయని మంగ్లీ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. మదీన్ ఎస్కే నేపథ్య సంగీతం సమకూర్చారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు తమ కుటుంబాలకు, స్వగ్రామాలకు దూరంగా ఉంటూ బతుకమ్మ పండుగను జరుపుకోలేకపోతున్న భావోద్వేగాలను ఈ పాట ప్రతిబింబిస్తుంది. స్వదేశానికి దూరంగా ఉన్నవారికి తమ మూలాలు, సంప్రదాయాలు, కుటుంబ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆత్మీయ అనుబంధాన్ని కలిగించడమే పాట ప్రధాన ఉద్దేశం.
ఈ పాట హిందూ-ముస్లిం సోదరభావం, మతసామరస్యం అనే సందేశాన్ని కూడా అందిస్తుంది. దూద్ సేమియా, సత్తు బెల్లం, ఖర్జూరం వంటి సాంస్కృతిక ప్రస్తావనలతో విభిన్న సంప్రదాయాల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పింది. గోల్కొండ కోట నుంచి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వరకు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రతీకాత్మకంగా అనుసంధానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చిన డప్పు, ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుబాయ్, అబుదాబిలో నివసిస్తున్న వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్టెపల్లి స్టూడియోస్ ద్వారా రూపొందిన ఈ పాటను తెలంగాణతో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ మహిళలకు కోట కుమార్ అంకితం చేశారు. స్పార్క్ మీడియాకు చెందిన సుతారి సత్యం, మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!