

దేశంలోని పేద కుటుంబాలకు, ప్రత్యేకించి దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (ఎన్ఎస్ఏపీ) పునర్ వ్యవస్థీకరించి, 2030-31 వరకు ఐదేళ్ల పాటు రూ.53,428 కోట్ల వ్యయంతో కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం పేరును ‘ప్రధాన మంత్రి సామాజిక సహాయతా యోజన’గా మార్చింది.
అంతేకాకుండా ఇప్పటివరకు దివ్యాంగుల పింఛను పొందడానికి ఉన్న 18 ఏళ్ల కనీస వయోపరిమితి నిబంధనను రద్దు చేసింది. దీంతో పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు పింఛను మంజూరు చేయనున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల ప్రకారం.. వైకల్య పరిమితిని 80 నుంచి 40 శాతానికి తగ్గించడంతో పాటు ఇతర క్యాటగిరీల సంక్షేమ పథకాలతో పోలిస్తే దివ్యాంగులకు అందించే సహాయం కనీసం 25 శాతం ఎక్కువగా ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది. అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) కింద రూ.2009.61 కోట్ల చెల్లింపునకు ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సామాజిక సహాయతా యోజన కింద 79 ఏళ్లలోపు వయసు వారికి నెలకు రూ.375, 80 ఏళ్లు, ఆపైబడిన వయసు వారికి నెలకు రూ.625 చొప్పున కేంద్రం తన వాటాగా అందిస్తుంది (దీనికి రాష్ట్రాలు ఇచ్చే వాటా అదనం). వృద్ధులు, వితంతువుల పింఛను పథకాలు, కుటుంబ ప్రయోజన పథకం ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగుతాయి. కేంద్ర మంత్రివర్గ తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!