

మలేషియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో కౌలాలంపూర్లో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ వాటి చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయ వంటకాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కౌలాలంపూర్లోని భారత హైకమిషన్కు చెందిన కాన్సులర్, పాస్పోర్టు, వీసా విభాగాల ప్రథమ కార్యదర్శి రాజేష్ హెచ్. మణియిల్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జనుల్యూరి, జానపద గేయ రచయిత, గాయకుడు దిలీప్ దేవ్గన్, ఛాయాగ్రాహకుడు అరుణ్ కొలుగూరి తమ కళా ప్రదర్శనలతో వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు. మలేషియాలోని వివిధ భారతీయ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఆహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీఆర్పీసీ మలేషియా ప్రైవేట్ లిమిటెడ్, రాపిన్నో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఆర్థిక సహకారం అందించగా, ఎంవై81 హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ ఆహార సహకారం అందించింది. మలేషియా తెలంగాణ సంఘం అధ్యక్షుడు సైదం తిరుపతి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే తమ లక్ష్యమని సంఘం ప్రతినిధులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!