

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని మోదీని నెతన్యాహు ఆహ్వానించినట్లు సమాచారం. పైలట్ స్మిత్ మచ్చర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాలని కూడా కోరినట్లు తెలిసింది.
ఫోన్ సంభాషణలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంప్రదింపులు, దౌత్య మార్గాలే సరైన పరిష్కారమని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, ఇజ్రాయెల్ కలిసి పోరాడుతున్నాయని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25, 26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన సందర్భంగా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలోనూ ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!