

దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రజాస్వామ్యం ఎలాంటి అనుమతినీ ఇవ్వదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ విపక్షాలు అశాంతిని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పు కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల ఆందోళనలపై స్పందించారు. దేశాభివృద్ధిలో యువత నిర్మాణాత్మక పాత్ర పోషించేలా ప్రోత్సహించాల్సింది పోయి, రాజకీయ ఘర్షణలకు వారిని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచేలా ఉన్నాయని విమర్శించారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు చట్టాన్ని గౌరవించడం అవసరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య సంస్థలను బలిచేయకూడదని అన్నారు. విపక్షాల ర్యాలీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజా తీర్పును గౌరవించి, రాజకీయాల్లో తన పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మరోవైపు, విపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఎన్నికల్లో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రధాని పదవిని సాధించలేరని, ప్రజల హృదయాలను గెలుచుకోవాలని మోదీ ఆ వీడియోలో పేర్కొన్నట్లు కంగనా విపక్ష నేతలకు కౌంటర్గా షేర్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!