

పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు చేపట్టిన వేర్వేరు ఆపరేషన్లలో ఓ ఆర్మీ మేజర్ మృతి చెందగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్వాదర్ జిల్లాలోని షాదీ కౌర్ ప్రాంతం, కలాత్ జిల్లాలోని జట్టాకాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టాయి. కలాత్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పాక్ సైనిక విభాగం ఐఎస్‌పీఆర్ వెల్లడించింది.
మరోవైపు, షాదీ కౌర్ ప్రాంతంలో ఉగ్రవాదులు అమర్చిన మెరుగుపరిచిన పేలుడు పరికరం (ఐఈడీ) పేలడంతో మేజర్ వజాహత్ వహీద్ మరణించారు. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మేజర్ మృతిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేసి, దేశ రక్షణలో ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. బలోచిస్తాన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!