

పాకిస్థాన్లోని పెషావర్లో అల్ ఖైర్ పాఠశాల పైకప్పు కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యార్థులు తరగతి గదిలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. లేడీ రీడింగ్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, 28 మంది చిన్నారులు, ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయస్సు 7 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్నట్లు సమాచారం. మరో 21 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ, వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. విద్యార్థులు తరగతి గదిలో ఉండగానే పైకప్పు కూలిపోయిందని పెషావర్ డిప్యూటీ కమిషనర్ అఫాక్ వజీర్ వెల్లడించారు. ఈ ఘటనపై ఖైబర్ పఖ్తూన్ఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి తీవ్ర విచారం వ్యక్తం చేసి, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!