

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ అనే నిందితుడి ఇంటి నుంచి రైఫిల్, పెద్ద సంఖ్యలో తూటాలు, మ్యాగజైన్లు, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాలటైన్కు చెందిన అతడు ఓ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రవాద భావజాలంతో ప్రభావితమై, హిందువులపై ద్వేషంతో ఈ నెల 11న ఆలయంలో కాల్పులు జరపాలని పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సెలవుదినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే, కాల్పులకు ఉపయోగించాలనుకున్న రైఫిల్ పనిచేయకపోవడంతో నిందితుడి ప్రయత్నం విఫలమైందని, అనంతరం అతడు ఇంటికి తిరిగి వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కుట్ర తీవ్ర కలవరానికి గురిచేసిందని అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయుల భద్రతతో పాటు హిందూ దేవాలయాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!