

యుద్ధాల ద్వారా దేశాలను బలహీనపరిచే పరిస్థితుల కంటే, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసి నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూ భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో జట్నీ ఇన్ఫోవ్యాలీ-2 పరిధిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో రూ.169 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ డేటా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1960–70 దశకాల్లో బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ, బ్యాంకింగ్ సేవలు పేదలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. అప్పట్లో పేదరిక నిర్మూలన నినాదానికే పరిమితమైందని వ్యాఖ్యానించారు. 2014 తర్వాత బ్యాంకింగ్ రంగంలో సమగ్ర మార్పులు చోటుచేసుకున్నాయని, డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ గణనీయంగా బలోపేతమైందని తెలిపారు.
ముద్ర, జన్‌ధన్, అటల్ పింఛన్ వంటి పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, స్వయం సహాయక సంఘాలకు కలిగిన ప్రయోజనాలను ప్రధాని వివరించారు. ప్రస్తుతం ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయని పేర్కొన్నారు. అదే సమయంలో పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చెందిన రెండో సైబర్ శిక్షణ, డేటా కేంద్రాన్ని ఒడిశాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి జుయల్ ఓరం, గవర్నర్ బ్రజ్ మోహన్ ప్రసాద్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!