

ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి, ఛఠ్ పూజ పండుగల సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 139వ సంచికలో మాట్లాడుతూ, ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి తోడ్పడే కీలకమైన ఆలోచన అని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను ఆదరించడం వల్ల రైతులు, గ్రామీణ కళాకారులు, చిన్న వ్యాపారులకు ఉపాధి, ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన మఖానా గ్రీస్‌కు ఎగుమతి అవుతుండటం, కర్ణాటకలోని కలబురగి కందిపప్పు మాల్దీవుల మార్కెట్‌కు చేరడం వంటి ఉదాహరణలను ప్రస్తావించారు. భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు.
మహారాష్ట్ర గిరిజనులు ‘శబరి నేచురల్స్’ ద్వారా తేనె, మహువా, చిర్, వెదురు ఉత్పత్తులను ఆధునిక ప్యాకేజింగ్‌తో మార్కెట్లోకి తీసుకురావడాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ ప్యాకేజింగ్‌కు జపాన్ గుడ్ డిజైన్ అవార్డు లభించడం భారతీయ సృజనాత్మకతకు గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఖాదీ, హస్తకళలకు పెరుగుతున్న ఆదరణ స్థానిక కళాకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. పండుగల సమయంలో స్థానిక వ్యాపారులు, కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. విజయదశమి రోజున ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పందిస్తూ, సామాన్య ప్రజల సేవాభావం, కృషిని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తనకు ఒక విలువైన అవకాశమని మోదీ పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!