

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం అందడంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. అమితాబ్ బచ్చన్‌కు చెందిన జల్సా లేదా ప్రతీక్ష బంగ్లాల్లో దేనిని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు చేసినట్లు పేర్కొన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈమెయిల్ పంపిన వ్యక్తి వివరాలు, బెదిరింపులో నిజానిజాలను నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గతంలోనూ ముంబైలోని పలు సంస్థలకు ఇలాంటి బెదిరింపు ఈమెయిళ్లు వచ్చినట్లు సమాచారం. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయానికి గతంలో బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఏడాది మార్చి 20న ముంబై ప్రెస్ క్లబ్‌కు కూడా భవనంలో విషవాయువుతో కూడిన చిన్న బాంబులు అమర్చినట్లు పేర్కొంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అక్కడ కూడా తనిఖీల్లో ప్రమాదకర వస్తువులు గుర్తించలేదు. తాజా బెదిరింపు నేపథ్యంలో పోలీసులు ఈమెయిల్ విశ్వసనీయతను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!