

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఊరట కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దర్శనం, వసతి కోసం ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు తదితరుల సిఫార్సు లేఖలను స్వీకరించడంపై ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వచ్చే భక్తులు నిరాశకు గురికాకుండా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీని కోరారు. సిఫార్సు లేఖల ఆధారంగా ఉచిత దర్శనం లేదా ఇతర ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాని పరిస్థితుల్లో, కనీసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రాల వారీగా టికెట్ల కోటా కేటాయించడం లేదా పారదర్శకమైన ఆన్‌లైన్ విధానంలో టికెట్లు అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని దుండ్ర కుమారస్వామి సూచించారు. ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ప్రముఖులకు కల్పించే సౌకర్యాలకు భిన్నంగా సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావన కలగకుండా చూడాలని అన్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించి, టీటీడీ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, టీటీడీ నిబంధనలకు అనుగుణంగా టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి భక్తులకు దర్శనాన్ని మరింత సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!