

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎనిమిది నెలలకు సరిపడా ఉపాధి పనుల ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, వీబీజీ రాం జీ పథకం కింద అనుమతించిన 370 రకాల పనులను ప్రాధాన్య క్రమంలో విభజించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
ఉపాధి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీవో) తీరుపై సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి కనిపించాలని, కేవలం సమాధానాలు చెబితే సరిపోదని హెచ్చరించారు. జాబ్ కార్డుల జారీలో నిర్లక్ష్యం వహించే మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో)పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెలాఖరులోగా మండల స్థాయి పనుల ప్రణాళికలను పూర్తి చేసి, నవంబర్ 1 నుంచి ఉపాధి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి రెండు నెలలకోసారి కార్యాచరణ ప్రణాళికల అమలుపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణంగా ఉపాధి పనులు చేపట్టాలని, పనుల ఎంపిక, అమలులో సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!