

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బంధించి విక్రయించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ హెచ్చరించారు. పాలపిట్టలను పట్టుకోవడం, వాటి రెక్కలను కత్తిరించి బోనుల్లో బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలను ప్రోత్సహించవద్దని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పండుగలు ఆనందం, స్వేచ్ఛ, జీవుల పట్ల కరుణను చాటాలని, మూగజీవాలను హింసించడం ద్వారా శుభం కలుగుతుందని భావించడం సరికాదని పేర్కొన్నారు.
పాలపిట్టలు పర్యావరణ సమతుల్యతకు, రైతులకు మేలు చేసే పక్షులని సజ్జనర్ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరమని పేర్కొన్నారు. ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1800 4255364, 98033 38666 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. పక్షులను బంధించి నిర్వహించే ప్రదర్శనలను ప్రోత్సహించకుండా, వాటి స్వేచ్ఛను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!