

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణను అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రక్షణ ఉత్పత్తుల తయారీతో పాటు స్పేస్, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన రక్షా ఎక్స్‌పో-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రక్షణ రంగ నిపుణులు, భారత సాయుధ దళాల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రెండో విడత ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ హాజరుకావాలని సీఎం ఆహ్వానించారు. గతేడాది తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, ఈసారి మరింత భారీ స్థాయిలో సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.రక్షణ రంగానికి చెందిన భాగస్వాములందరూ ఒకే వేదికపై సమావేశమై పెట్టుబడులు, వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు రక్షా ఎక్స్‌పో అంతర్జాతీయ వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్, బీడీఎల్, మిధాని, టాటా గ్రూప్, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశంలో హైదరాబాద్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన స్థానం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో అనేక పరిశోధనా సంస్థలు, భారత సైన్యం, వైమానిక దళాలకు సంబంధించిన కీలక కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ, భారత నౌకాదళానికి రాష్ట్రం కీలకమైన సేవలు అందిస్తోందని చెప్పారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్మిస్తున్న అత్యంత తక్కువ పౌనఃపున్యాల (VLF) నౌకాదళ రాడార్ కేంద్రాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!