

వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, నిబంధనలను సరళీకరించడం, వ్యాపార సంస్థలపై అనవసర అనుసరణ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖితో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. తొలి దశలో గుర్తించిన మొత్తం 23 ప్రాధాన్య రంగాల్లో సంస్కరణలను విజయవంతంగా అమలు చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు సంజయ్ జాజు కేంద్ర అధికారులకు వివరించారు. ఇటీవల రాష్ట్ర జన విశ్వాస్ బిల్లును చట్టంగా తీసుకురావడంతో తొలి దశలో మిగిలిన సంస్కరణ కూడా పూర్తయిందని తెలిపారు. నిబంధనలను సరళీకరించడం, పరిశ్రమలు, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రెండో దశలో మొత్తం 28 ప్రాధాన్య రంగాలను గుర్తించామని, వీటిలో 23 తప్పనిసరి సంస్కరణలు, ఐదు ఐచ్ఛిక సంస్కరణలు ఉన్నాయని సంజయ్ జాజు తెలిపారు. ఇప్పటివరకు 12 రంగాల్లో సంస్కరణలను అమలు చేసినట్లు వెల్లడించారు. వర్తించే అన్ని సంస్కరణలను 2026 నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అధిక పట్టణీకరణ కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు విధానపరమైన మార్పులు, ప్రక్రియల సరళీకరణ అవసరమని వివరించారు. రాష్ట్రం సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖి అభినందించారు. వ్యాపార సంస్థలు, పౌరులపై అనుసరణ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ సమావేశంలో అగ్నిమాపక సేవలు, పౌరసరఫరాలు, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని సంస్కరణల అమలు పురోగతిపై చర్చించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!