

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిధుల విడుదలకు అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని సంజయ్ జాజు సూచించారు. అవసరమైతే తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో చర్చిస్తానని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మహేష్ దత్ ఎక్కా, దానకిషోర్, రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానీయా, యోగితారాణా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పథకాల అమలులో నిధుల కొరత లేదా విడుదలలో జాప్యం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!