

తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరో అంతస్తులోని గది నంబర్ 33లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులు, వర్షపాతం లోటు, కరువు ముప్పు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కరువు పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి అవసరాల కోసం విద్యుత్ సరఫరా వంటి కీలక అంశాలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. అలాగే రైతులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణ చర్యలు, నీటి కొరతను ఎదుర్కొనే మార్గాలపై చర్చించనున్నారు. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు తీసుకుని, సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో తలెత్తే కరువు సంబంధిత సమస్యల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని పార్టీల సహకారాన్ని కోరనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!