

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో పోటీదారులు కావని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తమిళనాడు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో గురువారం చెన్నైలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ఇంజినీరింగ్ విద్య, ఆటోమొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాల తయారీలో తమిళనాడు సాధించిన ప్రగతి ఆదర్శనీయమని, ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
తమిళనాడుకు ప్రత్యేక బలాలు, తెలంగాణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు. కోయంబత్తూరులోని పంపుల తయారీ సంస్థలు ఉత్తర, మధ్య భారత మార్కెట్లకు చేరువయ్యేందుకు తెలంగాణలో రెండో యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. తిరుప్పూర్ నిట్వేర్ పరిశ్రమలు వరంగల్ వస్త్ర పరిశ్రమలతో కలిసి పనిచేయవచ్చని, చెన్నై ఆటో విడిభాగాల సంస్థలు హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో విద్యుత్ వాహనాల ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చని వివరించారు. పెట్టుబడిదారులకు నిర్ణీత సమయంలో అనుమతులు ఇచ్చేందుకు టీజీ-ఐపాస్ విధానం అందుబాటులో ఉందన్నారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అనంతరం తైవాన్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్, మలేషియా దేశాల దౌత్య, వాణిజ్య ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!