

రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించే విద్యాహక్కు చట్టం అమలుపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించింది. పలు రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కాకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27న జరిగే విచారణకు హాజరై అమలు తీరుపై నివేదిక సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్)ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఎన్‌సీపీసీఆర్‌కు.. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ దిల్లీకి వెళ్లి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ స్థాయిలో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ప్రత్యేక ప్రవేశ పోర్టల్, ఆన్‌లైన్ దరఖాస్తులు, లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు వంటి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ నిబంధన అమలుకు విధివిధానాలను రూపొందించాయి. తెలంగాణలోనూ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా 2025 జులైలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2025–26, 2026–27 విద్యాసంవత్సరాల్లో ఇప్పటివరకు 180 మంది మాత్రమే ప్రవేశాలు పొందినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ అంశంపై అధికారులు మళ్లీ చర్యలు ప్రారంభించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!