

రవాణా రంగంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో ఎయిర్‌పోర్ట్ తరహాలో నాలుగు ఆర్టీసీ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని తాటిపల్లి, మోరపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు మంత్రి లక్ష్మణ్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించే ఆర్టీసీ టెర్మినళ్లకు ప్రైవేటు బస్సులు కూడా వచ్చేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని, మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని బస్‌స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ప్రయాణికుల సంక్షేమంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవడం, కారుణ్య నియామకాలు, బకాయిల చెల్లింపు వంటి అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!