

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో మూడో వంతుకుపైగా జెన్కో విద్యుత్ కేంద్రాలు తీరుస్తున్నాయని తెలంగాణ జెన్కో వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పనితీరు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 325 మిలియన్ యూనిట్లుగా ఉండగా, అందులో 115 మిలియన్ యూనిట్లకు పైగా జెన్కో కేంద్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది మొత్తం వినియోగంలో సుమారు 36 శాతం. సింగరేణి సంస్థ 25 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 64 మిలియన్ యూనిట్లు అందిస్తున్నాయి. మిగిలిన విద్యుత్ అవసరాలను బయటి సంస్థల నుంచి కొనుగోలు చేసి భర్తీ చేస్తున్నారు.
2024 మార్చి 31 నాటికి 6,485.26 మెగావాట్లుగా ఉన్న జెన్కో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2026 జూలై 31 నాటికి 9,624.96 మెగావాట్లకు పెరిగింది. ఇందులో థర్మల్ విద్యుత్ సామర్థ్యం 7,180 మెగావాట్లు, జలవిద్యుత్ సామర్థ్యం 2,441.76 మెగావాట్లు, సౌర విద్యుత్ సామర్థ్యం 3.2 మెగావాట్లుగా ఉంది. 2024–25లో 26,960.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, 2025–26లో 32,568.89 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదే ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తి 6,912.42 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇది 3,931.69 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని మించింది. మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. అక్టోబర్ 15న 20,003 మెగావాట్లుగా నమోదైన డిమాండ్, అక్టోబర్ 16న ఉదయం 10:41 గంటలకు 20,018 మెగావాట్లకు చేరి కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!