

ప్రతిపక్ష పార్టీల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి (భారాస) తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఆదివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో ఎల్‌నినో సన్నద్ధత, ‘ఓటు బచావ్.. దేశ్ బచావ్’ కార్యక్రమం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని తెలిపారు. నీటి కొరతను అధిగమించి పంటలు ఎండిపోకుండా రైతులకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న విపత్తు దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల బోర్లకు గాను ఇప్పటికే 15 లక్షల బోర్లు ఎండిపోయాయని తెలిపారు.
కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలు చేసిన ఆయన, ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దిల్లీలో నిర్వహించనున్న పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, దుద్దిళ్ల శ్రీనుబాబు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!