

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ సలహాదారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు. బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను సిద్ధం చేయగా, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ వాటికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. తుది డిజైన్లకు ఆమోదం లభించిన తర్వాత పనుల అంచనాలను రూపొందిస్తామని వెల్లడించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరీక్షిత్ మెహ్రా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పునరుద్ధరణ ప్రణాళికను వివరించారు. బ్యారేజీల నిర్మాణం సాంకేతికంగా సుమారు 50 శాతమే పూర్తయినట్లు పరిగణిస్తున్నామని, మరమ్మతులకు వాటి అసలు నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్‌కు సమానమైన పరిమాణం అవసరమవుతుందని తెలిపారు. స్పిల్‌వేల నుంచి విడుదలైన వరద నీటి తీవ్రత కారణంగా దిగువ ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడ్డాయని, బ్యారేజీల్లో నిల్వ ఉన్న నీరు పునాదుల కింద నుంచి ప్రవహించి ఈ గుంతల ద్వారా బయటకు రావడం వల్ల నిర్మాణాలకు నష్టం జరిగినట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు.
పునరుద్ధరణలో భాగంగా వరద నీటి ఉధృతిని తగ్గించేందుకు స్టిల్లింగ్ బేసిన్లను విస్తరించాలని ప్రతిపాదించారు. మేడిగడ్డలో స్పిల్‌వే పొడవును 46.8 మీటర్ల నుంచి 66 మీటర్లకు, అన్నారంలో 45 మీటర్ల నుంచి 66 మీటర్లకు, సుందిళ్లలో 30 మీటర్ల నుంచి 58 మీటర్లకు పెంచాలని యోచిస్తున్నారు. బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంతాల్లో డయాఫ్రం గోడలు నిర్మించడంతో పాటు, ఆర్‌సీసీ కటాఫ్ నిర్మాణాల ద్వారా పునాదులను పటిష్టపరచనున్నారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ పునర్నిర్మాణానికి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు మెహ్రా తెలిపారు. దెబ్బతిన్న ఆరు పియర్లను తొలగించి తిరిగి నిర్మించడంతో పాటు స్టిల్లింగ్ బేసిన్ సామర్థ్యాన్ని పెంచడం ఒక ప్రత్యామ్నాయం. మరో ప్రతిపాదనలో పియర్లను తొలగించి, స్పిల్‌వేను క్రెస్ట్ పాండ్ స్థాయి వరకు పొడిగించి పునర్నిర్మించనున్నారు. మూడో ప్రత్యామ్నాయంగా ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి, డిజైన్‌లో కీలక మార్పులతో కొత్తగా నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిశీలన, ప్రతిపాదిత డిజైన్లకు లభించే ఆమోదం ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!