

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.600 ధరతో వీక్లీ బస్ పాస్‌ను ప్రారంభించింది. ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనితో ఏసీ బస్సులతో సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే, పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ సర్వీసులకు ఈ పాస్ వర్తించదని సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రోజువారీ, నెలవారీ పాస్‌లకు అదనంగా ఈ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణానికి విడిగా టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండటం దీని ప్రధాన ప్రయోజనం.
ఈ వీక్లీ పాస్ హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, వారం రోజుల పాటు నగరంలో ఉండే సందర్శకులకు ఉపయోగకరంగా ఉండనుంది. నగరంలోని సిటీ బస్ పాస్ కౌంటర్లలో ఈ పాస్‌లను కొనుగోలు చేయవచ్చని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, అందుబాటు ధరల్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో వారం రోజుల పాటు ప్రయాణించే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పాస్ కొనుగోలు చేసే సమయంలో దాని నిబంధనలను, ముఖ్యంగా పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్‌కు వర్తించదనే విషయాన్ని ప్రయాణికులు నిర్ధారించుకోవాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!