

నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో కదంబం ప్రత్యేకమైనది. పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రసాదంగా అందించే ఈ వంటకం సాధారణ సాంబార్ అన్నం కంటే భిన్నమైన రుచి, సువాసనతో ఉంటుంది. వివిధ రకాల కూరగాయలు, దుంపలు, బియ్యం, కందిపప్పుతో తయారు చేసే ఈ వంటకానికి కదంబం అనే పేరు వచ్చింది. ఇందులో ఉపయోగించే ప్రత్యేక మసాలా పొడి దీని రుచిని మరింత పెంచుతుంది.
కదంబం తయారీకి ఒక కప్పు బియ్యం, అర కప్పు కందిపప్పు, గుమ్మడికాయ, సొరకాయ, క్యారెట్, ముల్లంగి, మునక్కాయలు, టమాటాలు, బంగాళాదుంప, చిలకడదుంప, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు రసం, పసుపు, ఉప్పు, బెల్లం, నెయ్యి, కరివేపాకు, కొత్తిమీర అవసరం. ప్రత్యేక మసాలా పొడి కోసం మిరియాలు, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఇంగువ తీసుకోవాలి.
ముందుగా బియ్యం, కందిపప్పును నీళ్లు, పసుపు, ఉప్పుతో కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. మసాలా పొడికి అవసరమైన పదార్థాలను నూనె లేకుండా దోరగా వేయించి, చల్లారిన తర్వాత ఇంగువతో కలిపి మెత్తగా నూరుకోవాలి. మరోవైపు కూరగాయలను నీటిలో సగం ఉడికించి, చింతపండు రసం వేసి పచ్చివాసన పోయే వరకు మరిగించాలి. ఆ తర్వాత మసాలా పొడి, కరివేపాకు, బెల్లం, ఉడికించిన అన్నం, పప్పు వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర చేర్చి కొద్దిసేపు మగ్గిస్తే సువాసనభరితమైన కదంబం ప్రసాదం సిద్ధమవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!