

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 16 ఏళ్ల టీనేజర్ తుపాకీతో పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదేళ్లు, ఎనిమిదేళ్లు, పదకొండేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి, ఓ టీచర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలలోకి దుండగుడు ప్రవేశించడాన్ని గమనించిన ఓ స్థానిక వ్యక్తి అతడిని వెంబడించి కాల్పులు జరపడంతో నిందితుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. స్థానిక వ్యక్తి జోక్యంతో మరింత ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, దాడికి గల కారణాలు ఏమిటి? నిందితుడికి పాఠశాలతో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఈ అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇల్లినాయీ రాష్ట్రంలోని ఓ హిందూ ఆలయంపై దాడికి కుట్ర జరిగిందన్న వార్తలు వెలువడిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు అమెరికాలో పాఠశాలలు, ప్రార్థనా మందిరాల భద్రతపై మరోసారి చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!