

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రంలో పలు కీలక అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మహానది బొగ్గును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో అంతరాయం కలగకుండా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయాలని, సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటును వేగవంతం చేయడంతో పాటు తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని తుమ్మల కోరారు. సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి రైల్వే లైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాండురంగాపురం–మల్కన్గిరి రైల్వే లైన్ను సారపాక వరకు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు కేటాయింపులు, ఎరువుల సరఫరా, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతం లభించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!