

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అక్టోబరు 12 నుంచి 20 వరకు జరిగిన ఉత్సవాల్లో భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. గరుడసేవ రోజున భారీ వర్షం కురిసినా భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించినట్లు వివరించారు. అక్టోబరు 12 నుంచి 19 వరకు ఎనిమిది రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.25.79 కోట్ల కానుకలు లభించాయి. ఈ కాలంలో 22.60 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేయగా, 2.44 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. మొత్తం 34.34 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చైర్మన్ వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 26 రాష్ట్రాలు, ఖతర్, దుబాయ్‌ల నుంచి వచ్చిన కళాబృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాయి. సుమారు 60 టన్నుల పుష్పాలు, ఐదు లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టగా, తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు, వాహనసేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రవాణా కోసం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య సేవల కోసం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్సులు, మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం వేలాది మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించగా, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!