

అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసినా, రెన్యువల్ దరఖాస్తు పెండింగ్లో ఉన్నవారు ఉద్యోగాలు కొనసాగించేందుకు వీలు కల్పించే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) మంగళవారం కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిర్ణయంతో వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వలసదారులపై ప్రభావం పడనుంది.
గతంలో అర్హులైన వలసదారులు తమ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం గడువులోగా దరఖాస్తు చేసుకుంటే, పాత పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా గరిష్ఠంగా 540 రోజుల వరకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండేది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది ఈ విధానంపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. తాజాగా ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ను రద్దు చేస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో రెన్యువల్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగితే, వలసదారులు తమ ఉద్యోగాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!