

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ప్రారంభించనుంది. భక్తులు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్లో ఎంపికైన వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సేవా టికెట్ల సొమ్ము చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
అలాగే, 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు టికెట్లు, వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!