

తిరుమలలో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈసారి వర్షాల కారణంగా గ్యాలరీల్లోని భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహన సేవలో మలయప్పస్వామిని దర్శించుకునే అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో చాలామంది భక్తులు వర్షంలోనూ తమ స్థానాల్లోనే ఉండిపోయారు. గరుడ వాహనసేవ రోజున టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గ్యాలరీల్లోని భక్తుల వద్దకు వెళ్లి వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షం కారణంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, మెరుగైన ఏర్పాట్ల అవసరాన్ని పరిశీలించారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్యాలరీల్లో పెద్దపెద్ద గొడుగులు ఏర్పాటు చేయడంతో పాటు, వర్షం నుంచి రక్షణ కల్పించే వివిధ రకాల షెడ్ల నిర్మాణంపై అధికారులు ఆలోచిస్తున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏర్పాట్లు అమలులోకి వస్తే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వర్షం సమయంలో మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!