

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కార్చిచ్చులు, సైబర్ దాడులు, విద్యుత్, నీరు, ఇంటర్నెట్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలిగే పరిస్థితులను ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ‘బీ రెడీ’ (Be Ready) ప్రచారాన్ని ప్రారంభించింది. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కనీసం మూడు రోజులపాటు ఇబ్బందులను తట్టుకునేలా అవసరమైన సామగ్రిని ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. ఇందుకోసం అత్యవసర సన్నద్ధతకు సంబంధించిన జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందస్తుగా కొన్ని చిన్నచిన్న ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా సంక్షోభ సమయంలో ఇబ్బందులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
తాగునీరు, ఎక్కువకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, బ్యాటరీ లేదా చేతితో తిప్పి పనిచేసే రేడియో, టార్చిలైట్, అదనపు బ్యాటరీలు, దుప్పట్లు, ఛార్జ్ చేసిన పవర్ బ్యాంక్, అత్యవసర మందులు, డిజిటల్ చెల్లింపులు పనిచేయని పరిస్థితుల్లో ఉపయోగించేందుకు కొంత నగదు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అవసరమైన వస్తువులన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేయకుండా, ప్రతి వారం సాధారణ షాపింగ్ సమయంలో కొద్దికొద్దిగా సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా సామగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించింది. ఈ ప్రచారం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కొంతవరకు స్వయంగా సంసిద్ధంగా ఉండటంతో పాటు, అత్యవసర సేవలు ఎక్కువ సహాయం అవసరమైన వారికి ప్రాధాన్యమివ్వడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!