

హుస్నాబాద్ నియోజకవర్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ‘స్టీల్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అభినందించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్‌కు ఆయన లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర సామూహిక వేడుకల్లో వినియోగించుకునేందుకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల పూర్తి సెట్లను అందుబాటులో ఉంచేలా ‘స్టీల్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్లాస్టిక్ వినియోగాన్ని, వ్యర్థాలను క్షేత్రస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు స్థానిక స్థాయిలో చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని భూపేందర్ యాదవ్ తన లేఖలో వివరించారు. అధిక కాలుష్యానికి కారణమయ్యే ఎంపిక చేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఉత్పత్తిదారుల విస్తరించిన బాధ్యత (EPR) అమలు, పునర్వినియోగం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం వంటి చర్యలు ఇందులో భాగమని పేర్కొన్నారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాల తయారీదారులు, విక్రేతలకు సంబంధించిన సంకలనాన్ని 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసినట్లు, అది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రజలు సమన్వయంతో కృషి చేస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమర్థంగా, స్థిరమైన పద్ధతుల్లో తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!