

కెనడాను విచ్ఛిన్నం చేసి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆరోపించారు. ఆల్బెర్టా ప్రావిన్స్లో కెనడా నుంచి విడిపోవాలా వద్దా అనే అంశంపై అక్టోబర్ 19న జరగనున్న ఓటింగ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆల్బెర్టా ప్రజలు కెనడాలోనే కొనసాగేందుకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు. వేర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దీర్ఘకాలిక అనిశ్చితి, రాజకీయ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నాయని, కెనడా ఐక్యతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని కార్నీ పేర్కొన్నారు.
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కార్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చర్చకు దారితీశాయి. ఆల్బెర్టా కెనడా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు, సహజవాయు వనరులతో సమృద్ధిగా ఉన్న ప్రావిన్స్. అయినప్పటికీ, తమకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక వనరుల కేటాయింపు లభించడం లేదని అక్కడి వేర్పాటువాద అనుకూల వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరల్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ విభేదాలు వేర్పాటువాద చర్చకు కారణమవుతున్నాయి. అక్టోబర్ 19న జరగనున్న ఓటింగ్లో కెనడా నుంచి విడిపోయే ప్రక్రియను చట్టబద్ధంగా ప్రారంభించాలా వద్దా అనే అంశంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!