

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం నిర్వహించిన సంబురాలకు మహిళలు, యువతులు, చిన్నారులు భారీగా తరలివచ్చారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించిన మహా బతుకమ్మ ర్యాలీలో 700 మంది జానపద కళాకారులు, 600 మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్ తీరం లేజర్ షో, బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మహిళా నేతలు, విదేశీ దౌత్యవేత్తలు ఈ వేడుకలకు హాజరయ్యారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి మహిళను బతుకమ్మలా గౌరవించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చెరువులు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో చేరి బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలకు పూజలు నిర్వహించి, సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి సీతక్క, ఇతర అధికారులతో కలిసి రష్మిక బతుకమ్మ ఆడుతూ మహిళలు, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ ఆడటం చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద బతుకమ్మ వేడుకలకు రష్మికను తీసుకెళ్లి ఆడిస్తానని గతంలో మాట ఇచ్చానని గుర్తుచేశారు. రాష్ట్రంలో పండుగలు ఇంత ఉత్సాహంగా జరగడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు, రష్మిక బతుకమ్మ ఆటలో పాల్గొని మహిళలతో కలిసి వేడుకలను ఆస్వాదించారు. ఆమె పాల్గొనడం అక్కడి మహిళలు, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!